Site icon HashtagU Telugu

Ravela Kishore: రావెల దారెటు!

Ravela

Ravela

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రాజీనామా లేఖ పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత, సుస్థిర, సమర్ధవంతమైన పాలన నచ్చి బీజేపీలో చేరినట్లు లేఖలో పేర్కొన్నారు. మోదీపై ఉన్న గౌరవమే తనను పార్టీ వైపు ఆకర్షించిందని, పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు సోము వీర్రాజుకు రాసిన లేఖలో రావెల వివరించారు. రావెల కిషోర్ బాబు IRS అధికారిగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశించారు. తరువాత TDPలో చేరారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. కొద్దిరోజుల తర్వాత రావెల పనితీరు, జిల్లా నేతలతో సమన్వయం లేకపోవడంతో టీడీపీలో ఆయనపై అసంతృప్తి నెలకొంది. ఆ తర్వాత కొడుకు వ్యవహారంతో పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కిషోర్ బాబు మంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత రావెల పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుత పరిస్థితుల ద్రుష్ట్యా రావెల ఏ పార్టీలో చేరుతారనేది ప్రశ్నార్థకమే. అయితే ఆయన వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు స్పష్టంగా తెల్పడంతో ఇక ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.