Site icon HashtagU Telugu

Hemant Soren: హేమంత్ సోరెన్ బలపరీక్షకు కోర్టు అనుమతి

Hemant Soren

Hemant Soren

Hemant Soren: జైల్లో ఉన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానం త్వరలో జరగనున్న బలపరీక్షలో పాల్గొనేందుకు అనుమతించింది. జార్ఖండ్‌లో ఫ్లోర్ టెస్ట్ ఫిబ్రవరి 5 న జరిగే అవకాశం ఉంది. భూ కేసులో హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం పీఎంఎల్‌ఏ కోర్టు అతడిని 5 రోజుల ఈడీ కస్టడీకి పంపింది.

చంపై సోరెన్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, జెఎంఎం నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కోరిన విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు కోర్టు అనుమతి కోరుతూ హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అసెంబ్లీ సభ్యుడినని, ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనే హక్కు తనకు ఉందని హేమంత్ సోరెన్ కోర్టుకు విన్నవించారు. చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్షను కోరింది. సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమికి 41 మంది ఎమ్మెల్యేలు అవసరం. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అధికార కూటమి ప్రకటించింది. హేమంత్ సోరెన్ సోదరుడి భార్య సీతా సోరెన్‌తో సహా మరికొందరు కూడా చంపై సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

బిజెపి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి 38 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ఫ్లోర్ టెస్ట్‌కు ముందే ఎమ్మెల్యేలు రాంచీకి తిరిగి వస్తారు. మహాకూటమిలో ఎటువంటి ఇబ్బంది లేదని జేఎంఎం చెప్తుంది. కాగా హేమంత్ సోరెన్ నేతృత్వంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు మరియు పథకాలను కొత్త ప్రభుత్వం వేగవంతం చేస్తుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు చంపాయ్ సోరెన్. ఆదివాసీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను గద్దె దించే కుట్రను దేశం మొత్తం చూసింది. ఈ కుట్రలను బట్టబయలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు.

Also Read: Telangana: 4% కోటా అమలుపై సీఎంని అభ్యర్ధించిన ముస్లిం నేతలు