ఏపీ ప్రభుత్వానికి, మాజీ నిఘాధిపతి ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య జరుగుతోన్న వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ చెల్లదని ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశాడు. నిబంధనల ప్రకారం రెండేళ్ల గడువు దాటితే సస్పెన్షన్ చెల్లదనే పాయింట్ లేవనెత్తాడు. సస్పెన్షన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిందని తెలియచేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది.
విడతవారీగా సస్పెన్షన్ గడువును పెంచుతూ వచ్చిన ఏపీ సర్కార్ రెండేళ్ల పాటు ఆయన్ను సర్వీసుకు దూరంగా ఉంచగలిగింది. కానీ, రెండు ఏళ్లు పూర్తి కావడంతో తదుపరి సర్వీసుకు దూరంగా ఉంచాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. సస్పన్షన్ గడువు రెండేళ్లు పూర్తి అయిన కారణంగా తదుపది సస్పెన్షన్ కు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సీఎస్ శర్మ కు లేఖ ద్వారా తెలిపాడు. ఆ అనుమతి తీసుకోక పోవడంతో ఆటోమేటిక్ గా సర్వీసులో ఉన్నట్టే అవుతుందని, ఆ మేరకు పూర్తి జీతం చెల్లించాలని జగన్ సర్కార్ ను కోరాడు.
ఏబీ చివరి సస్పెన్షన్ గడువును 31.7.2021న పొడిగించబడింది. అందుకు సంబంధించిన GO రహస్యంగా ఉంచారని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెబుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జీవో కాపీ అందలేదని లేఖలో పొందుపరిచాడు.
1989 ఏపీ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశాడు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా పని చేశాడని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ కంపెనీ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం విదితమే. రెండేళ్ల సస్పెన్షన్ గడువు పూర్తి కావడంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఏమి చేస్తుందో..చూడాలి.