హైదరాబాద్ అన్ని కూడళ్లలో, రోడ్లపై, ప్రార్థనా స్థలాల్లో , వాటికి దగ్గరలో గాలిపటాలు ఎగురవేయడాన్ని హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. జనవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జనవరి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబందనలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శబ్ద కాలుష్య (నియంత్రణ) రూల్స్ 2000లోని రూల్ 8 ప్రకారం సంబంధిత పోలీసు అధికారుల నుండి అనుమతి పొందకుండా, బహిరంగ ప్రదేశంలో లౌడ్ స్పీకర్లు/ DJలను కూడా నిషేధిస్తున్నట్టు పోలీసులు తమ ఆదేశాల్లో తెలిపారు. “లౌడ్ స్పీకర్లలో రెచ్చగొట్టే ప్రసంగాలు/పాటలు వినిపించకూడదు. శబ్ద కాలుష్య స్థాయిలు అనుమతించదగిన పరిమితులను మించకూడదు, ”అని సి వి ఆనంద్ అన్నారు.
వాణిజ్య ప్రాంతాల్లో పగటి సమయంలో 65 డెసిబుల్స్, రాత్రి సమయంలో 55 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లోపగలు, రాత్రి కూడా 55 డెసిబుల్స్, సైలెంట్ జోన్ లో పగటి పూట 50 డెసిబుల్స్ రాత్రి 40 డెసిబుల్స్ కు మించకూడదు. భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ ఉపయోగించరాదు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయాలని, వారిని పర్యవేక్షించాలని, ప్రమాదాలను నివారించడానికి ప్రహరీ గోడలు లేని డాబాలపైకి అనుమతించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాలిపటాలు సేకరించేందుకు తమ పిల్లలు రోడ్లపై పరుగులు తీయకుండా చూడాలని తల్లిదండ్రులను పోలీసులు కోరారు. “విద్యుత్ స్తంభాలు లేదా తీగల నుండి విచ్చలవిడి గాలిపటాలను సేకరించడానికి ప్రయత్నిస్తే, కరెంట్ షాక్ కొడుతుందనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలి” అని హైదరాబాద్ సీపీ అన్నారు.