ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ దుర్వార్తతోనే తెల్లవారింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. బాతువ సమీపంలో సోమవారం రాత్రి సమయంలో జరిగిన ఈ దుర్ఘటన అందరి మనసులను తీవ్రంగా కలిచివేసింది.
కోయంబత్తూరు నుంచి సిల్ చెర్ కు వెళ్తున్న గువాహటి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదాన్ని ఊహించి ఉండరు. కానీ చీపురుపల్లి దాటిన తరువాత వారిని మృత్యువు బలితీసుకుంది. చీపురుపల్లి దాటాక ఈ రైలులోని ఒక బోగీలోంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. దీంతో భయపడి చైన్ ను లాగి రైలును ఆపేశారు. అదే సమయంలో కొంతమంది రైలు దిగి పక్కనున్న పట్టాలపై నిల్చున్నారు.
ఇదే మార్గంలో భువనేశ్వర్ నుంచి విశాఖ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వేగంగా వచ్చింది. అప్పటికే పట్టాలపై ఉన్నవారు ఆ రైలును గమనించలేదు. దీంతో ఆ రైలు వారిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. శరీర భాగాలన్నీ తునాతునకలయ్యాయి. మృతుల్లో ఇద్దరు అస్సాం వాసులు. ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తి.. ఒడిశాలోని బ్రహ్మపుర వాసి. ఆయనకు శ్రీకాకుళంలోని సర్వజనాసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
ప్రమాదం రాత్రివేళ జరగడం.. చుట్టు చిమ్మచీకటి ఉండడంతో అక్కడ సహాయక చర్యలను వేగంగా చేపట్టడానికి ఆటంకం ఏర్పడింది. రైలు ఏ కారణం వల్ల మధ్యలో ఆగిపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణికులు కిందకు దిగకూడదు. అందులోనూ రాత్రివేళ అస్సలు రైలు నుంచి బయటకు రాకూడదు. ఎందుకంటే పక్క ట్రాక్ పై ఏ రైలు వస్తుందో గమనించేలోపే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.