Site icon HashtagU Telugu

Google vs Chat GPT: గూగుల్‌కు తొలి షాక్..100 బిలియన్ డాలర్ల నష్టం..

Google lost 100 Billion Dollars

Google

‘చాట్‌ జీపీటీ’ (Chat GPT) కి పోటీగా ‘బార్డ్’ను రంగంలోకి దింపిన గూగుల్‌కు (Google) ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. బార్డ్‌కు సంబంధించిన ఓ అడ్వర్‌ టైజ్‌ మెంట్‌ లో భారీ తప్పిదం దొర్లడంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫెబెట్ షేర్ ధర బుధవారం భారీ ఒడిదుడుకులకు లోనైంది. దీంతో.. సంస్థ ఒక్క రోజులోనే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువను కోల్పోవాల్సి వచ్చింది.

ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తొలుత ‘బార్డ్’ యాడ్‌లోని తప్పిదాన్ని గుర్తించింది. సౌర వ్యవస్థ వెలుపలి గ్రహాల చిత్రాలను తొలిసారిగా ఏ శాటిలైట్ క్లిక్ మనిపించిందన్న ప్రశ్నకు బార్డ్ సరైన సమాధానం ఇవ్వడంలో పొరపాటు పడింది. ట్విట్టర్‌లో గూగుల్ (Google) షేర్ చేసిన ఓ షార్ట్ వీడియోలో ఈ పొరపాటు దొర్లింది. ప్యారిస్‌లో బార్డ్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఇది బయటపడటంతో కంపెనీ షేర్లపై పెను ప్రభావం పడింది. దీనికి తోడు.. బార్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా టెక్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించలేదన్న విశ్లేషణలు కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి.

‘‘ఇది చిన్న పొరపాటే కానీ.. మార్కెట్ మాత్రం గూగుల్‌కు భారీ శిక్ష వేసింది. ఒకరకంగా ఇది సబబే. ఎందుకంటే.. చాట్‌జీపీటీతో దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్‌కు గూగుల్ ఏవిధంగా సవాల్ విసురుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.’’అని మార్కెట్ పరిశీలకులు ఒకరు వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో గూగుల్‌ కృత్రిమ మేథ రేసులో వెనుకబడిపోతోందన్న వ్యాఖ్యలు బయలుదేరాయి.

Also Read:  Kim with his Daughter: కుమార్తెతో మళ్లీ కనిపించిన కిమ్