UP Polls: ‘యూపీ’ ఎలక్షన్ ఫైట్… తొలి విడత పోలింగ్ ప్రారంభం!

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు.

Published By: HashtagU Telugu Desk
assembly elections

assembly elections

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. మరోవైపు యూపీ ఎన్నికల వేళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లు ఉత్సాహంగా ఎన్నికల పండుగలో భాగస్వామ్యమై తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు.

ఉత్తర్ ప్రదేశ్ మహా సంగ్రామంలో తొలి విడత పోలింగ్ లో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు నేడు(గురువారం) ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు ఉండగా… 623 మంది అభ్యర్థుల బరిలో దిగారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సోషల్ డిస్టన్స్ పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది. ఉత్తర్ ప్రదేశ్ మంత్రి అతుల్ గార్గ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన గజీయాబాద్ కావి నగర్ లో ఓటు వేశారు. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. మొదటి దశ ఎన్నికలు జరిగే ఈ జిల్లాల్లోనే రైతులు ఉద్యమాన్ని చేపట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో అనేది ఉత్కంఠగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇకపోతే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలో డిసైడ్ చేసే ఎన్నికలే యూపీ ఎలక్షన్స్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే… కేంద్రంలో ఆ సర్కారే రూలింగ్ చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ నేపధ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎంతో కీలకంగా మారాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలే యూపీ ఎలక్షన్స్ గా మనం భావించవచ్చు.

  Last Updated: 10 Feb 2022, 09:54 AM IST