Site icon HashtagU Telugu

AP Occult Ritual : కన్న తండ్రే కాలయముడు.. కూతురు నోట్లో కుంకుమ కుక్కి..

Crime

Crime

ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన కన్న తండ్రే కాలయముడిగా మారితే.. ఏ కూతురైనా ఏం చేయగలదు? నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో ఉన్న పేరారెడ్డిపల్లిలో జరిగిన సంఘటన అందరి మనసులను కలచివేస్తోంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని.. పూజలు చేస్తే మళ్లీ లాభాలు వస్తాయని ఎవడో చెప్పాడు. దానిని నమ్మి.. కన్న కూతురు నోటినిండా కుంకుమ కుక్కాడు వేణు అనే కర్కోటక తండ్రి. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది.

వేణుగోపాల్ పొక్లెయిన్ తో పనులు చేస్తాడు. కానీ ఆ వ్యాపారం సరిగా జరగడం లేదు. దీంతో నష్టాలు వచ్చాయి. ఆ లాస్ ని ఎలా పూడ్చుకోవాలో తెలియలేదు. తమ కుటుంబానికి చెడు జరుగుతోందని ఆయనకు అనిపించింది. దుష్టశక్తులు ఆవహించాయని భ్రమపడ్డాడు. అందుకే పూజలు చేస్తే అవన్నీ పోయి.. మళ్లీ వ్యాపారం బాగా నడుస్తుందన‌్న మూఢనమ్మకంతో కన్న కూతురినే బలితీసుకున్నాడు.

వేణుగోపాల్ కు కవల కుమార్తెలు. అందులో ఒక కూతురు పేరు పునర్విక. ఆ చిన్నారి వయసు మూడేళ్లు. పూజల కోసం ఆమెను పూజగదిలో పడుకోబెట్టాడు. ఆమె ఒంటిపై పసుపు నీళ్లు పోయాలని తన భార్యకు చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆ తరువాత నోట్లో కుంకుమ పోశాడు. అదేదో చిటికెడు అయితే.. అస్వస్థతతో ఆగేదేమో.. కానీ ఏకంగా నోట్లో కుంకుమ కుక్కేశాడు. దీంతో పునర్వికకు అస్సలు ఊపిరాడలేదు. భయంతో, బాధతో కేకలు వేసింది.

పునర్విక కేకలు విన్న చుట్టుపక్కలవారు వచ్చి అక్కడ జరుగుతున్న తంతును చూశారు. వేణును తిట్టి.. అక్కడే ఆపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని వెంటనే ఆత్మకూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో వేరే దారిలేక వెంటనే అక్కడి నుంచి చెన్నైకు తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అందరి మనసులను కలచివేసింది. వేణును పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version