Chad Doerman: అమెరికాలో దారుణం.. ప‌దేళ్ల‌లోపు వ‌య‌సున్న ముగ్గురు చిన్నారుల‌ను కాల్చి చంపిన తండ్రి..

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ప‌దేళ్ల వ‌య‌స్సులోపుఉన్న ముగ్గురు చిన్నారుల‌ను తండ్రి తుపాకీతో కాల్చి చంపాడు.

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 09:10 PM IST

అమెరికాలోని ఒహైయోలో దారుణం జ‌రిగింది. క్లెర్మాంట్ కౌంటీ (Clermont County) కి చెందిన 32ఏళ్ల చాడ్ డోరేమాన్‌ (Chad Doerman) దారుణానికి పాల్ప‌డ్డాడు. ముగ్గురు కుమారుల‌ను కాల్చి చంపాడు. చాడ్ నుంచి త‌న భార్య‌, కుమార్తె స్వ‌ల్ప‌గాయాల‌తో త‌ప్పించుకున్నారు. ఈ దారుణ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. పోలీసులు చాడ్ డోరేమాన్‌ను అరెస్టు చేశారు. అయితే, వారిని చంపేందుకు చాడ్ కొద్ది రోజులుగా ప్ర‌ణాళిక వేస్తున్నాడ‌ట‌. అత‌ని త‌న సొంత కొడుకుల‌ను ఎందుకు కాల్చి చంపాల్సి వ‌చ్చింద‌నే విష‌యం తెలియ‌రాలేదు. పోలీసులు ఈ మేర‌కు నిందితుడిని విచారిస్తున్నారు.

క్లెర్మాంట్ కౌంటీకి చెందిన చాడ్‌డోరేమాన్‌కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. మూడు, నాలుగు, ఏడేళ్ల వ‌య‌సున్న త‌న ముగ్గురు కుమారులు, ప‌దేళ్ల వ‌య‌స్సు ఉన్న కుమార్తెను వ‌రుస‌లో నిల‌బెట్టి చాడ్ డోరేమాన్ తుపాకీ గురిపెట్టాడు. పిల్ల‌ల‌కు ఏం జ‌రుగుతుందో అర్థంకాలేదు. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో చాడ్ కాల్పులు జ‌రిపాడు. ఇద్ద‌రు కుమారులు మ‌ర‌ణించారు. ఒక కుమారుడు, కుమార్తె అక్క‌డి నుంచి పారిపోయారు. పిల్ల‌ల‌ను చంపుతున్న భ‌ర్త‌ను భార్య అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయినా ఆగ‌కుండా.. ఆమెపైసైతం కాల్పులు జ‌ర‌ప‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డింది. త‌న‌నుంచి త‌ప్పించుకొని పారిపోయిన కుమారుడు, కుమార్తెను వెంబ‌డించాడు. ఇంటి పెర‌ట్లో కుమారుడు క‌నిపించ‌డంతో అత‌న్ని ప‌ట్టుకొని వ‌చ్చి కాల్పులు జ‌రిపి హ‌త్య‌చేశాడు.

కుమార్తె పెద్ద‌గా కేక‌లు పెట్టుకుంటూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసింది. స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఇదే స‌మ‌యంలో బెల్లెట్ గాయంతో బాధ‌ప‌డుతున్న చాడ్ భార్య కూడా 911 నెంబ‌ర్ ఫోన్‌చేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొనేలోపు చాడ్ డోరేమాన్‌ త‌న ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్న చాడ్‌ భార్య‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, వీరిని చాడ్ డోరేమాన్ ఎందుకు చంపాల‌ని అనుకున్నాడో అనే విష‌యం తెలియ‌రాలేదు. పోలీసులు ఈ విష‌యాన్ని రాబ‌ట్టేందుకు చాడ్‌ను విచారిస్తున్నారు.

Karnataka Victims: మత హింసలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం