Site icon HashtagU Telugu

Viral Video: ప్యాసింజర్‎గా తండ్రి.. పైలెట్‎గా కూతురు.. వైరల్ వీడియో!

160123krutadnya

160123krutadnya

Viral Video: తమ బిడ్డలు జీవితంలో ఎంతో ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. తమకు అందనంత ఎత్తులో ఉంటే గర్వంగా తలెత్తుకునేలా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కలలు గంటారు. అయితే ఇలా జరిగినప్పుడు మాత్రం ఆ తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అచ్చంగా ఇలా ఆనందంలో తండ్రి కంట్లో నీళ్లు తెప్పించిందీ ఓ కూతురు.

తాను పైలెట్ గా ఉన్న విమానంలో తన తండ్రి ప్రయాణిస్తున్నాడని తెలుసుకొని.. నేరుగా వెళ్లి అతడి ఆశీర్వచనాలు తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన పైలెట్ కృతజ్ఞ ఈ మేరకు ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. సదరు వీడియో చూసిన నెటిజన్లు కూడా ఎంతో సెంటిమెంటల్ గా కామెంట్లు పెడుతూ మెచ్చుకున్నారు.

ముంబైకి చెందిన కృతజ్ఞ ఎంతో కష్టపడి పైలెట్ కాగా.. తన కలకు తన తండ్రి ఎంతో కష్టపడ్డాడు. మొత్తానికి కృతజ్ఞ పైలెట్ కాగా.. ఆమె నడుపుతున్న ఫ్లైట్ లోనే తన తండ్రి ప్రయాణించాడు. దీంతో కృతజ్ఞ తన తండ్రి కాళ్లకు నమస్కారం చేసుకొని, ఆశీర్వాదం పొందింది. ఈ సందర్భంగా తండ్రి కళ్లలో ఆనంద భాష్పాలు రాగా.. కూతురు ముఖం మీద చిరునవ్వు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కృతజ్ఞ పోస్ట్ చేసింది.

కృతజ్ఞ తన ఇన్ స్టాగ్రామ్ లో సదరు వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నేను పైలెట్ గా ఉన్న విమానంలో నాన్నను తీసుకెళ్లా. టేకాఫ్ కు ముందు ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నా. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా ఇంటి నుండి బయటకు రాను. ఉద్యోగరిత్యా కొన్నిసార్లు తెల్లవారుజామునే బయల్దేరాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు నిద్రలో ఉంటారు. అయినప్పటికీ వారి పాదాలను తాకకుండా బయటకు రాను’ అని రాసింది.

కృతజ్ఞ పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ఎంతోమందికి ఈ వీడియో హార్ట్ టచింగ్ గా అనిపించడంతో.. ఏకంగా ఈ వీడియోకు 5.7 లక్షల లైకులు వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లలో ఒకరు..‘ఆమె తన తండ్రికి గౌరవం ఇచ్చే విధానం నచ్చింది’ అని కామెంట్ చేస్తే, మరొకరు ‘నాకు నీళ్లొచ్చాయి. మీలాంటి మహిళలు మమ్మల్ని గర్వపడేలా చేస్తారు. ప్రేరణగా నిలుస్తారు’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్.. ‘ఒక తండ్రి ఇంతకంటే ఏం కోరుకుంటారు’ అని కామెంట్ చేస్తే.. ‘ఈ వీడియో చూసి కదిలిపోయా! నిజమైన సంప్రదాయాలు ఇవి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.