ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టడం చాలా అరుదు. ఆలా అరుదైన వాటిలో పెద్ద హిట్ అందుకున్న సినిమా ‘జాతి రత్నాలు’. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఫరియా అబ్దుల్లా నటనకు.. ఆమె అందాలకు ఫిదా అయ్యారు. ఆకర్షణీయమైన తన సహజ నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, సిల్వర్ స్క్రీన్ పై తన హవాను కొనసాగించడం ఖాయమనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. తాజాగా ‘బంగార్రాజు’ సినిమాలో ఫరియా ఆడిపాడిన ‘వాసివాడి తస్సాదియ్యా’ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నారు. సంతోష్ శోభన్ జోడీగా ఆమె ఇప్పటికే ఒక ఛాన్స్ కొట్టేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఇక రవితేజ సరసన నటిస్తున్న సినిమా ‘రావణాసుర’ ఈ నెల 14వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.