Site icon HashtagU Telugu

IPL 2022: డుప్లెసిస్ కే బెంగుళూర్ పగ్గాలు

Faf Du Plessis

Faf Du Plessis

ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ కోసం2008 నుంచి ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ మార్పులతో బరిలోకి దిగబోతోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో పక్కా వ్యూహంతో ఆటగాళ్లను కొనుగోలు చేసిన RCB ఈసారి టైటిల్ గెలవాలని తహతహలాడుతోంది.. మెగా వేలానికి రూ. 57 కోట్లతో వెళ్లిన బెంగళూరు ఫ్రాంఛైజీ.. మొత్తం 18 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసింది.మొత్తంగా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో కలిపి ఆర్సీబీ టీం లో ఇప్పుడు 22 మంది ఆటగాళ్లు ఉన్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ ఫాప్ డుప్లిసెస్‌ ఎంపికయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మెగా వేలంలో డుప్లిసెస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌-2021 సీజన్‌ తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో కెప్టెన్ గా అనుభవమున్న డుప్లెసిస్ ను సారథిగా నియమించుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది..

ఈ విషయంపై ఆర్సీబీ ఫ్రాంచైజీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. బెంగళూరు జట్టు సారథిగా ఫాఫ్ డుప్లిసెస్‌ సరైన వ్యక్తి అని తాము అనుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటుగా ఐపీఎల్ లో మంచి అనుభవమున్న డుప్లెసిస్ ఆర్సీబీ జట్టును అద్భుతంగా ముందుకు నడిపించగలడని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అంశంపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన చేయబోతున్నాం అని సదరు అని ఆర్సీబీ ఆధికారి చెప్పుకొచ్చారు. గత సీజన్ వరకూ డుప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు.