J&K Blast:ప్రధానమంత్రి మోదీ ర్యాలీ జరిగే చోటుకు 12 కి.మీ దూరంలో పేలుడు !

జమ్మూ కశ్మీర్‌లో నేడు (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీ జరిగే ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. జమ్మూ జిల్లాలోని లాలియానా గ్రామంలోని పొలంలో ఆదివారం ఈ పేలుడు జరిగింది.

  • Written By:
  • Publish Date - April 24, 2022 / 12:53 PM IST

జమ్మూ కశ్మీర్‌లో నేడు (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీ జరిగే ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. జమ్మూ జిల్లాలోని లాలియానా గ్రామంలోని పొలంలో ఆదివారం ఈ పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉల్క లేదా మెరుపు వల్ల లాలియానా గ్రామంలో బిలం ఏర్పడిందని జమ్మూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చందన్ కోహ్లీ తెలిపారు. పేలుడు ఉగ్రదాడులకు సంబంధించినదిగా కనిపించడం లేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ తొలిసారిగా నేడు అక్కడ పర్యటించనున్నారు.

మోదీ పాల్గొనే కార్యక్రమాలు..

– జమ్మూ కశ్మీర్‌లో రూ. 20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మోదీ చేయనున్నారు.
– బనిహాల్-ఖాజిగుండ్ సొరంగ మార్గం, ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే, రాట్లే క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
– జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.