Site icon HashtagU Telugu

TDP : పోలీసుల కనుసన్నల్లోనే మాచర్ల విధ్వంసకాండ – మాజీ మంత్రి య‌న‌మ‌ల‌

Yanamala

Yanamala

మాచ‌ర్ల‌లో పోలీసుల క‌నుస‌న్న‌ల్లోనే విధ్వంస‌కాండ జ‌రిగింద‌ని మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆరోపించారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొనసాగుతుందనడానికి నిన్నరాత్రి మాచర్లలో జరిగిన ఘటన నిదర్శనమ‌న్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముందుగా నిర్ణయించిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ఇంఛార్జ్‌ బ్రహ్మారెడ్డి నేతృత్వంలో ప్రశాంతంగా నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ రౌడీ మూకలు ఒక్కసారిగా మారణాయుధాలతో విరుచుకుపడి బ్రహ్మారెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించాయిని ఆయ‌న ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంతోపాటు బ్రహ్మారెడ్డి ఇంటిని పెట్రోలుపోసి తగులబెట్టారని… దాదాపు మూడుగంటలపాటు వైసీపీ రౌడీ మూకలు మాచర్లలో విధ్వంసకాండకు తెగబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. డీజీపీతో పాటు ఇతర పోలీసు అధికారులంతా గుంటూరులో ఉండగానే ఈ విధ్వంసకాండ కొనసాగిందని య‌న‌మ‌ల ఆరోపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయ‌న కోరారు.