Site icon HashtagU Telugu

Kollu Ravindra : బీసీల‌మా బానిస‌ల‌మా ..? జ‌గ‌న్ స‌ర్కార్ పై మాజీ మంత్రి కొల్లు ఫైర్‌

Kollu Ravindra

Kollu Ravindra

జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీసీ నాయ‌కుడు మ‌ర‌ణిస్తే వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్ళే హ‌క్కు త‌మ‌కు లేదా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మాచ‌ర్ల‌లో బీసీ నేత జ‌ల్ల‌య్య హ‌త్య‌తో రోడ్డున ప‌డ్డ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శ‌కు వెళుతున్న కొల్లు ర‌వీంద్రను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు ప్ర‌య‌త్నించ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు మ‌ధ్య తీవ్ర తోపులాట జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కొల్లు ర‌వీంద్ర మాట్లాడుతూ.. రాష్ర్టంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారం చేప‌ట్టినప్ప‌టి నుండి బీసీల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయిందని ఆరోపించారు. ఇప్ప‌టిదాకా 37 మందిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం పొట్ట‌న పెట్టుకుందని.. ఇంకా మీ దాహం తీర‌లేదా ? ఎంత ర‌క్త‌పాతం సృష్టించాల‌నుకుంటున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక్క ప‌ల్నాడులోనే 14 మంది తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు హ‌త‌మార్చారంటే వైసీపీ ర‌క్త‌దాహం, తెలుగుదేశం పార్టీపైన క‌క్ష అర్థ‌మ‌వుతుందని తెలిపారు. బీసీల‌ను చంపితే భ‌య‌ప‌డి వెన‌క్కు వెళ‌తామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనుకుంటున్నార‌ని.. ఎన్నిదాడులు జ‌రిగినా వెన‌క‌డుగు వేసే చ‌రిత్ర బీసీల‌కు లేదన్నారు.