Site icon HashtagU Telugu

Chandrababu Naidu: పెట్రో బాదుడులో ఏపీ నంబర్ వన్!

Chandrababu

Chandrababu

పెట్రోల్, డీజీల్ ధరలను నిరసిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశార్. ‘‘నాడు అభివృద్ధిలో దేశం లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం…ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానం లో ఉంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అదే సమయంలో ఆయా  రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయం.  తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితం పై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుంది’’ అని మండిపడ్డారు.

‘‘ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదు. గతేడాది చివర్లో దేశంలో అనేక  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా…అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారు’’ అని బాబు అన్నారు. ఇప్పుడు కేంద్రం పెట్రోల్‌పై రూ.8లు, డీజిల్‌పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేసారు? వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.