Site icon HashtagU Telugu

Maha Governor: ఇంక రాజకీయాలు చాలు.. రాజీనామా చేస్తున్నా: మహా గవర్నర్

Maharashtra Governor

Maharashtra Governor

Maha Governor: రాజకీయాల్లో ఎవరికైనా పదవి మీద వ్యామోహం ఉంటుంది. పదవి కోసం ఏం చేయడానికైనా నాయకులు సిద్ధంగా ఉంటారు. పదవులు లేకపోతే రాజకీయ నాయకులకు పెద్దగా ప్రయోజనాలు ఉండవనే భావన ఉంటుంది. అయితే రాజకీయాల్లో సీనియర్లు అయిపోతే గవర్నర్లు అవుతారనే నానుడి ముందు నుండి ఉంది. చాలామంది గవర్నర్లు ఇదే ప్రాతిపదికన నియమితులు అవుతుండటం కూడా తెలిసిందే.

అయితే మహారాష్ట్రలో ఓ సంచలన వార్త అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోశ్యారీ.. తాను రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముంబైకి వచ్చిన ప్రధానికి తెలియజేసినట్లు ట్విట్టర్ ద్వారా కోశ్యారీ ప్రకటించాడు. ఇక మీదట తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, తన శేష జీవితాన్ని రాయడానికి, చదవడానికి అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో వివాదాస్పద విషయాల్లో కలిగించుకున్న గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. తన రాజీనామా గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కోశ్యారీ.. ‘మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి సేవలందించినందుకు ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చింది’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోశ్యారీ అనేక వివాదాస్పద నిర్ణయాలతో అక్కడ రాజకీయ నాయకుల చేత విమర్శలు ఎదుర్కొన్నాడు. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ తో తెల్లవారు జామునే ప్రమాణ స్వీకారం చేయించడం పెద్ద దుమారమే రేగింది. మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరాఠా యోధుడు శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా వార్తల్లో నిలిచింది.