Government Office : జగిత్యాల జిల్లాలో హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఆఫీస్ పెచ్చులూడిపోతుండంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇలా హెల్మెట్లు పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 09:49 AM IST

బైక్ ఫై ప్రయాణించేటప్పుడు కదా హెల్మెట్లు పెట్టుకునేది..వీరు ఎందుకు ప్రభుత్వ ఆఫీసులో హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు అని అనుకుంటున్నారా… ఆఫీస్ పెచ్చులూడిపోతుండంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇలా హెల్మెట్లు పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో చోటుచేసుకుంది.

తెలంగాణ సర్కార్..రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెపుతున్నప్పటికీ..రాష్ట్రంలో చాల ప్రభుత్వ ఆఫీసులు (Government Offices) శిథిలావస్థలో ఉన్నాయి. అప్పుడెప్పుడో బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మించిన..పలు ప్రభుత్వ ఆఫీసులు ప్రస్తుతం శిథిలమై, నేల కూలటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆఫీస్ లలో ఉద్యోగులు హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్న ఘటనలు వెలుగులోకి రాగా, తాజాగా జగిత్యాల (Jagtial ) జిల్లా బీర్‌పూర్ ఎంపీడీఓ కార్యాలయం (Beerpur MPDO Office)లోను ఇదే పరిస్థితి.

ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని కార్యాలయాల ఉద్యోగులు (Employees) సిబ్బంది తమ ప్రాణాలను సైతం అరిచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన భయంతో హెల్మెట్లు (Helmets) ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని పని చేసుకుంటున్నారు.

ప్రభుత్వానికి పలుమార్లు సంబంధిత అధికారులు అంచనాలు తయారుచేసి నిధులు మంజూరు చేయాలని కోరినప్పటికీ , ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. పైకప్పు పూర్తిగా దెబ్బతినడం తో వర్షాలు పడుతున్నప్పుడు..నీరు కిందకు కారుతుందని, దీంతో కార్యాలయంలోని విలువైన రికార్డులు తడిసి పాడవుతున్నాయి అని వారంతా వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త బిల్డింగ్ త్వరగా కట్టాలని కోరుతున్నారు.