Electoral Bonds Sale : ఎన్నికలు అంటేనే ఎంతో ఖర్చు ..
రాజకీయ పార్టీలకు ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం..
వాటికి మాత్రం డబ్బులు చెట్లకు కాస్తాయా ?
ఎలక్టోరల్ బాండ్‌లను దేశ పౌరులు, సంస్థలు, కంపెనీలకు విక్రయించి పొలిటికల్ పార్టీలు ఫండ్స్ ను సేకరిస్తాయి..
గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 1% ఓట్లు పొందిన రాజకీయ పార్టీలకు ఈ ఫండ్స్ పొందే అర్హత ఉంటుంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు మరో రెండు నెలల సమయం ఉందనగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 27వ విడత ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 3 నుంచి 12 వరకు ఎలక్టోరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు(SBI) చెందిన 29 బ్రాంచ్‌ల ద్వారా విక్రయిస్తారు. ఎస్బీఐకి చెందిన బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్‌కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్‌పూర్, ముంబై శాఖలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే(Electoral Bonds Sale) అనుమతి ఉంది. ఎలక్టోరల్ బాండ్ జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్ డిపాజిట్ చేసినా ఏ రాజకీయ పార్టీకీ చెల్లింపు జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరిసారిగా ఎలక్టోరల్ బాండ్ల విక్రయం 2018 సంవత్సరంలో మార్చి 1 నుంచి 10 వరకు జరిగింది.