Site icon HashtagU Telugu

Security for Modi: మోడీ సభకు హై సెక్యూరిటీ!

PM Modi SPG

PM Modi SPG

వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ సభకు దాదాపుగా పది లక్షల మంది హాజరవుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రధాని రాక సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నేటి నుంచే అప్రమత్తమయ్యారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏవిధంగా భద్రతా చర్యలు చేపట్టాలి? అనే విషయాలపై పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు జులై 2-3 తేదీల్లో జరగనున్న బహిరంగ సభకు భారీ భద్రతా ఏర్పాట్లలో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు.

హైటెక్ సిటీలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరగనున్న జాతీయ కార్యవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర అగ్రనేతలు హాజరుకానున్నారు. జూలై 3న జాతీయ కార్యవర్గం ముగిసిన తర్వాత, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని, ఇతర ముఖ్య నేతలు ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సిటీ పోలీసు బలగాలను విస్తృతంగా మోహరిస్తామని చెప్పారు.
“యాక్సెస్ కంట్రోల్‌తో పాటు విధ్వంస నిరోధక జాగ్రత్తలు, VVIPల రక్షణ కోసం భద్రతా ప్రణాళికలను రూపొందించాలని, లా & ఆర్డర్, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించారు. సభకు అనుమతి ఇచ్చిన పాస్ హోల్డర్లు మాత్రమే బహిరంగ సభలో పాల్గొనడానికి అనుమతించబడతారని స్పష్టం చేశారు. దీంతో ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఉంటుంది. ప్రధానమంత్రి పర్యటన వివరాలు, ఆయన రాక, బస, హాజరు, నిష్క్రమణ, అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మిక ప్రణాళికల గురించి పోలీస్ ఉన్నతాధికారులు చర్చించారు.

అన్ని శాఖల అధికారులు, ఎస్పీజీతో అనుసంధానం చేసేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, చివరి నిమిషంలో కార్యక్రమంలో ఎలాంటి మార్పులు చేయవద్దని పోలీస్ బాస్ బీజేపీ ప్రతినిధులకు సూచించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలివచ్చే వాహనాలకు తగిన పార్కింగ్‌ గ్రౌండ్స్‌ను కంటోన్మెంట్‌ అధికారులు కేటాయించాలని ట్రాఫిక్‌ శాఖ దృష్టికి తెచ్చారు. తగినన్ని జనరేటర్లను ఏర్పాటు చేయాలని TSCPDCL బిజెపి నాయకత్వాన్ని కోరింది. వేదికల వద్ద ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్‌లతో పాటు పరికరాలను కూడా ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖను కోరింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నందున టెస్టులు సైతం వేగవంతం చేయనున్నట్టు వెల్లడించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రతి శాఖ నుండి ఒక సీనియర్ అధికారిని అలర్ట్ చేయాలని నిర్ణయించారు.