ప్రకృతి వైపరీత్యమైన ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావం కేవలం అన్నదాతలకే కాకుండా, సామాన్య ప్రజల జీవితాలపై కూడా పెను భారాన్ని మోపనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై నెల ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో రుతుపవనాల వర్షాలు పడకపోవడంతో అటు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడగా, ఇటు గృహ వినియోగదారులపై కూడా దీని ప్రభావం ఊహించని రీతిలో పడుతోంది.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో పడకపోవడంతో దేశవ్యాప్తంగా సాగు నీటి కొరత ఏర్పడి పంటల దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇది మార్కెట్లో డిమాండ్ మరియు సప్లై మధ్య సమతుల్యతను దెబ్బతీసి, రాబోయే రోజుల్లో బియ్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటేలా చేస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చేతిలో ఉపాధి లేక, మరోవైపు ఉచిత పథకాలకు దూరం అవుతూ, ఇంకోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. ప్రకృతి సృష్టించిన ఈ వాతావరణ మార్పులు చివరకు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారులకు ఎల్ నినో ఎఫెక్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఎండ తీవ్రత, విపరీతమైన ఉక్కపోత కారణంగా ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను విరివిగా వాడుతున్నారు. దీనివల్ల నెలవారీ విద్యుత్ వినియోగం ప్రభుత్వం విధించిన 200 యూనిట్ల పరిమితిని దాటిపోతోంది. కేవలం జూన్ నెలలోనే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (TGNPDCL) పరిధిలోనే దాదాపు 4 లక్షల మంది వినియోగదారులు ఈ పరిమితి దాటడం వల్ల ఉచిత విద్యుత్ పథకానికి దూరమయ్యారు. మొత్తం 26.54 లక్షల మంది లబ్ధిదారుల్లో కేవలం 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు రాగా, మిగిలిన వారికి భారీగా బిల్లులు వచ్చాయి. జూలై నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో అనర్హుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.
