Site icon HashtagU Telugu

Elections: ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు: ఈసీ

Template (71) Copy

Template (71) Copy

ఒమైక్రాన్‌ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది.

ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూలు ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5 రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితి గురించి ఎన్నికల సంఘం సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజ్ భూషణ్ తో చర్చించి అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి గురించి భూషణ్‌ ఈసీకి వివరించారు. ఎన్నికల సమయంలో కొవిడ్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరంపైనా చర్చించారు. ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఈసీ కోరింది.

ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మణిపూర్‌లలో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసు కున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఈసీ తెలిపింది. ఉత్తరాఖండ్‌, గోవాలో 100% పూర్తయినట్లు పేర్కొంది. ఈ 5 రాష్ట్రాల్లో అర్హులైనవారికి రెండో డోసు త్వరగా ఇవ్వాలని భూషణ్‌ను ఈసీ కోరింది.

ఎన్నికల సభలు, ర్యాలీలు నిషేధించాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది. ర్యాలీలను ఆపకపోతే రెండో వేవ్ కంటే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి శేఖర్‌యాదవ్‌ హెచ్చరించారు. బెంగాల్‌లో ఎన్నికల వల్ల అనేకమంది కరోనా సోకి మరణించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఈసీ సభ్యులు మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన తరువాత సరైన నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. కాగా, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయని ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.