Eatela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంట విషాదం..

బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

  • Written By:
  • Updated On - August 24, 2022 / 01:13 PM IST

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వృద్ధాప్య సమస్యలతో చాలా రోజులుగా ఈటల మల్లయ్య బాధపడుతున్నారు. దీంతో తండ్రిని, కుమారుడు ఈటల రాజేందర్ హైదరాబాద్‌ లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయినా.. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. తండ్రి మల్లయ్య మరణవార్తను ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

నిన్న మంగళవారం అర్ధరాత్రి ఆయన భౌతిక కాయాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లని ఈటల స్వగృహానికి తరలించారు. నేడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటల కుటుంబీకులు తెలిపారు. తండ్రి ఈటల మల్లయ్యకు మొత్తం ఎనిమిది మంది సంతానం.. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కాగా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో కుమారుడు.. ఈటల మల్లయ్య మృతితో కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈటెల మల్లయ్యను కడసారి చూసేందుకు.. ఈటలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్ బిజీబిజీగా ఉన్నారు. దీంతో కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ హోదాలో వలసలపై సీరియస్‌గా దృష్టిసారించారు.. కలిసి వచ్చే వారందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. ఈటల రాజేందర్ భార్య జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నికల కోసం పనిచేస్తున్నారు. ఇక తండ్రి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న మంగళవారం అంతా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) రాత్రి తన తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వెళ్లి.. అంత్యక్రియలు నుంచి దశదిన కర్మ వరకు అక్కడే ఉండనున్నారు. అనంతరం.. ఆ తర్వాతే మళ్లీ రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.