Dussehra: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.

Published By: HashtagU Telugu Desk
Indrakiladri

Indrakiladri

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పది రోజుల పాటు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీ సోమవారం పాడ్యమి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి అలంకారం. బంగారు రంగు చీర కడతారు. అమ్మవారికి కట్టెపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం పెడతారు. మంగళవారం విదియ శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం.

లేత గులాబీ రంగు చీర కడతారు. పులిహార ప్రసాదం పెడతారు. బుధవారం తదియ శ్రీ గాయత్రీ దేవి అలంకారానికి కాషాయ లేదా నారింజ రంగు చీర కడతారు. కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం ప్రసాదంగా అమ్మవారికి పెడతారు. గురువారం చవితి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారానికి గంధపురంగు లేదా పసుపు రంగు చీర అలంకరిస్తారు. దద్దోజనం, క్షీరాన్నం , అల్లం గారెలు ప్రసాదంగా పెడతారు. శుక్రవారం పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారానికి కుంకుమ ఎరుపు రంగు చీర కడతారు. దద్దోజనం, క్షీరాన్నం ప్రసాదంగా పెడతారు.

అక్టోబరు 1వ తేదీ శనివారం షష్ఠి శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం. గులాబీ రంగు చీర అలంకరిస్తారు. చక్కెర పొంగలి, క్షీరాన్నం ప్రసాదంగా పెడతారు. 2వ తేదీ ఆదివారం సప్తమి శ్రీ సరస్వతీదేవి అలంకారం. తెలుపు రంగు చీర అలంకరిస్తారు. దద్దోజనం , కేసరి , పరమాన్నం ప్రసాదంగా వడ్డిస్తారు. 3 తేదీ సోమవారం అష్టమి శ్రీ దుర్గా దేవి అలంకారం. ఎరుపు రంగు చీర అలంకరిస్తారు. కదంబం , శాకాన్నం ప్రసాదంగా పెడతారు. 4వ తేదీ మంగళవారం నవమి శ్రీ మహిషాసురమర్ధిని అలంకారానికి ముదురు ఎరుపు రంగు చీర కడతారు. చక్కెర పొంగలి ప్రసాదంగా పెడతారు.

5వ తేదీ బుధవారం దశమి చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఆకుపచ్చ రంగు చీర అలంకరిస్తారు. లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం ప్రసాదంగా వడ్డిస్తారు. ఈ 9 రోజులు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు, పోలీస్ శాఖ వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

  Last Updated: 25 Sep 2022, 02:01 PM IST