Site icon HashtagU Telugu

Drugs: సంగారెడ్డిలో పాకిస్థాన్ డ్రగ్స్!

‘ట్రామడాల్ అనే సైకోట్రోపిక్ డ్రగ్‌’ను తయారు చేసి పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలపై సంగారెడ్డిలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్‌తో పాటు ముగ్గురు ఉద్యోగులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బెంగళూరు శాఖ పోలీసులు అరెస్టు చేశారు. 2021లో 25,000 కిలోల వరకు ట్రామడాల్‌ను అనధికారికంగా (ఎలాంటి అనుమతులు లేకుండా) పాకిస్థాన్ కు ఎగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 3.85 కిలోల వరకు ఎసిటిక్ అన్‌హైడ్రైడ్ డిక్లేర్డ్ స్టాక్‌కు సంబంధించి వ్యత్యాసాన్ని గుర్తించారు. అయితే ట్రామాడోల్, ఎసిటిక్ అన్‌హైడ్రైడ్ రెండూ 2018 నుంచి 1985 NDPS చట్టం ప్రకారం నియంత్రించబడ్డాయి. ఈ డ్రగ్స్ పై నిషేధం ఉన్నా.. ఫార్మా వ్యక్తులు అనుమతులు లేకుండానే పాకిస్తాన్ కు సరఫరా చేశారు.

సంగారెడ్డి జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ API తయారు చేసే ఫార్మా కంపెనీ లూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ద్వారా తెలంగాణ నుంచి ఆకాశం, సముద్ర మార్గాల ద్వారా ఈ డ్రగ్ పాకిస్థాన్‌కు చేరుతోందని ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ అమిత్ ఘావటే తెలిపారు. పాకిస్తాన్‌లో ఇతర పార్టీలు, వాటి కొనుగోలుదారుల ప్రమేయంపై మేం మరింత దర్యాప్తు చేస్తున్నాం. అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. “ఈ ఆపరేషన్‌ లో ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. మేం ‘లూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‘ ప్రాంగణంలో దాడులు చేశాం. 2021లో పాకిస్తాన్‌కు 25,000 కిలోల ట్రామాడోల్‌ని అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఎగుమతి చేసినట్లు గుర్తించాం. ఈ మేరకు ఎసిటిక్ అన్‌హైడ్రైడ్ స్టాక్‌ను లెక్కించినప్పుడు, 3.85 కొరత ఉన్నట్లు తేలింది. అని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.