Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు (మంగళవారం) మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సీఈఓ డాక్టర్ మధుబానంద కర్ మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ , వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.
స్నాతకోత్సవం మంగళగిరి ఎయిమ్స్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందజేసి, స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. మొత్తం 49 ఎంబీబీఎస్ విద్యార్థులు, నలుగురు పీహెచ్‌డీ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులు ఈ కార్యక్రమంలో డిగ్రీలను స్వీకరిస్తారు.
తెలంగాణ పర్యటన వివరాలు:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 18న తెలంగాణ పర్యటన ప్రారంభిస్తారు. ఈ సమయంలో ఆమె సికింద్రాబాద్‌లోని రాష్టప్రతి నిలయం, బొలారంలో ఆతిథ్యం పొందనున్నారు. డిసెంబర్ 18న రాష్టప్రతి నిలయంలో వివిధ పథకాల ప్రారంభోత్సవాలు , భూమి పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సికింద్రాబాద్ డిఫెన్స్ కాలేజీ కార్యక్రమం:
డిసెంబర్ 20న సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌కు ‘రాష్ట్రపతి కళర్స్’ అందజేస్తారు. అదే సాయంత్రం రాష్టప్రతి నిలయంలో అట హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రముఖులు, గౌరవనీయ వ్యక్తులు పాల్గొంటారు.
రాష్ట్రపతి మంగళగిరి పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌కు సంబంధించి ప్రత్యేక ఆంక్షలు విధించబడినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.
1. చెన్నై నుంచి వైజాగ్ వైపుకు వెళ్లే వాహనాలు : గుంటూరు బుడంపాడు మీదుగా అవనిగడ్డ-పామర్రు-గుడివాడ-హనుమాన్ జంక్షన్ వైపు మళ్లించారు.
2. వైజాగ్ నుంచి ఏలూరు, విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వాహనాలు : హనుమాన్ జంక్షన్-గుడివాడ-పామర్రు-అవనిగడ్డ మీదుగా మళ్లించారు.
3. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు : తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు.
వాహనదారులు ఈ మార్గాల హెచ్చరికలను గమనించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.