Errabelli Dayakar Rao: పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు ఆద్వర్యంలో పాలకుర్తిలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా ను నిర్వహిస్తున్నారు. ఈ మేళాను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఈ రోజు (జులై 17) నుండి జులై 31వ తేదీ వరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలన్న లక్ష్యంతోనే ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని మంత్రి సూచించారు.
లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం నేరమన్నారు. అందుకే తాముఈ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలకుర్తి లోని పార్టీ కార్యాలయంలో అప్లికేషన్స్ తీసుకుంటారని, దరఖాస్తుతోపాటు 1) ఆధార్ కార్డు. 2) పాన్ కార్డు. 3) టెన్త్ సర్టిఫికెట్. 4)రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకుని రావాలని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని, దరఖాస్తులు మాత్రం పాలకుర్తిలోనే ఇవ్వాలని మంత్రి సూచించారు.
Also Read: Samantha Spiritual: సినిమాలకు గుడ్ బై.. ఆధ్యాత్మిక యాత్రలకు సై!