ఈరోజు నుంచి ఆగష్టు 22 వరకూ వాతావరణం చల్లబడిపోతుందని, దగ్గు, జ్వరం వంటి సమస్యలు అందరికీ వస్తాయని సాగుతున్న ప్రచారం నిజం కాదని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. సూర్యుడు, భూమి మధ్య దూరం గురించి ప్రస్తావిస్తూ, అది తగ్గిపోతుందని చేస్తున్న ప్రచారం వాస్తవ విరుద్ధంగా ఉంది. సూర్యుడు, భూమి మధ్య దూరం ఇది 67 శాతం పెరిగిపోతుందనే వాదన అర్థసత్యంగా చెబుతున్నారు. దాని ప్రభావంగా వాతావరణం చల్లబడిపోతుందనే ప్రచారంలో అర్థం లేదంటున్నారు.
ఒకవేళ నిజంగా జూలై ఆగష్టులో వాతావరణం కొంత చల్లబడితే మనకి మంచిదే. ఎందుకంటే నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గగానే ఏటా జూలైలో కొన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని ఆ సందేశంలో పేర్కొన్నట్టుగా జరిగితే సంతోషిద్దాం. కానీ ఇలాంటి ప్రచారాలు నమ్మి కలవరపడకండి. వాటిని షేర్ చేసి ఇంకొందరిని కంగారు పెట్టకండి. మనకు పూర్తిగా అర్థంకాని శాస్త్రీయ, సైంటిఫిక్ అంశాల గురించి ప్రచారం చేసేముందు పలుమార్లు ఆలోచించండి.