Site icon HashtagU Telugu

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. నిందితుడిగా కోర్టులోకి..!

Donald

Donald

పోర్న్‌స్టార్‌కి మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ సీనియర్ నేత డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి. న్యూయార్క్ మాన్‌హట్టన్ కోర్టు బయట పోలీసులు భారీ భద్రత మధ్య ఆయన్ని మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. తర్వాత ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్ కి ఇది పెద్ద దెబ్బే.

అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న ట్రంప్.. అరెస్టు తర్వాత విచారణను ఎదుర్కొన్నారు. ఆయనపై మొత్తం 34 అభియోగాలను జడ్జి చదవగా.. వాటిలో దేనిలోనూ తాను దోషిని కాదని ట్రంప్ తెలిపారు. ఈ విచారణ తర్వాత ట్రంప్‌ కోర్టు నుంచి మాములుగానే వెళ్లిపోయారు. ఈ విచారణను రికార్డ్ చేసేందుకు మీడియాకి అనుమతి ఇవ్వలేదు.

Also Read: Underwater Living: నీటి లోపల 100 రోజులు నివసిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. సరికొత్త ప్రయోగం?

దీంతో అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు. కాగా, తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు మాన్ హట్టన్ కోర్టు ఎదుట ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియ‌ల్స్ కు ల‌క్షా 30 వేల డాల‌ర్ల డ‌బ్బు ఇచ్చిన ట్రంప్‌పై ఆ కేసులో నేరాభియోగాలు న‌మోదయ్యాయి. లైంగిక సంబంధం బయట పెట్టకుండా శృంగార తార డేనియల్స్ కు ట్రంప్ డబ్బు చెల్లించారు. ట్రంప్‌ అరెస్ట్ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూయార్క్‌ సహా అమెరికాలోని పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.