Site icon HashtagU Telugu

Donald Trump: “ఏడు యుద్ధాలు ఆపాను… నోబెల్ ఇవ్వాల్సిందే” – ట్రంప్ ఘనంగా

Donald Trump

Donald Trump

న్యూయార్క్:(Donald Trump Nobel Peace Prize): అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, తన రెండో పదవీకాలంలో ఏకంగా ఏడు యుద్ధాలను నిలిపినందుకు నోబెల్ ప్రైజ్ రావాలని స్పష్టం చేశారు. వాటిలో 60 శాతం యుద్ధాలను తాను వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆపగలిగానని చెప్పారు.

భారత్–పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను కూడా తానే చల్లబరిచానని గతంలో పేర్కొన్న ట్రంప్, తాజాగా మరోసారి ఇదే వ్యాఖ్యలు పునరావృతం చేశారు. “భారత్, పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. నేను వారిద్దరినీ కలిపి చర్చలు జరిపిన తర్వాత వాళ్లు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించారు. అమెరికా వాణిజ్యం ఆగిపోతుందని చెప్పిన వెంటనే వాళ్లు ఒప్పుకున్నారు” అని ట్రంప్ తెలిపారు.

అయితే ఈ అంశంపై భారత్ నిరాకరణ వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ చేసిన సైనిక చర్యలతోనే పాక్ వెనక్కి తగ్గిందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకారం, భారత్–పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఏ మూడో పక్ష జోక్యం లేదని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

ట్రంప్ తన ప్రసంగంలో మరోసారి పలు అంతర్జాతీయ ఉద్రిక్తతలను తానే ఆపానని పేర్కొన్నారు. థాయిలాండ్–కాంబోడియా, ఆర్మేనియా–అజర్‌బైజాన్, కొసావో–సెర్బియా, ఇజ్రాయెల్–ఇరాన్, ఈజిప్ట్–ఇథియోపియా, రువాండా–కాంగో లాంటి దేశాల మధ్య జరిగిన ఉద్రిక్తతలను తాను చర్చల ద్వారా ఆపగలిగానన్నారు.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుతూ, “ఈ యుద్ధాన్ని కూడా నేను ముగిస్తాను. అది సాధ్యమే. అప్పుడైనా నోబెల్ బహుమతి వస్తుందేమో చూడాలి. కానీ ఇప్పటి వరకు ఏడు యుద్ధాలను ఆపానన్నదే పెద్ద విషయం!” అని అన్నారు.

Exit mobile version