దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన చమురు సంస్థలు, తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచాయి. ఈ క్రమంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్ ధర 1002 రూపాయలకు చేరింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. చమురు సంస్థలు నిర్ణయంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇక పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 349 రూపాయలకు చేరగా, 10 కిలోల కాంపోజిట్ సిలిండర్ ధర 669 రూపాయలకు చేరింది. అలాగే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2003.50 రూపాయలకు చేరుకుంది. ఇక వంట గ్యాస్ ధరలు రాష్ట్రాల వారిగా చూసుకుంటే తెలంగాణలో 1,002, ఆంధ్రప్రదేశ్‌లో 1,008, ఢిల్లీ అండ్ ముంబైలలో 949.50, కోల్‌కతాలో రూ. 976, చెన్నైలో 965, లక్నోలో 987 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర చేరుకుంది.
ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలపై సామాన్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ వార్ నేపధ్యంలో ఇప్పటికే వంట నూనెల ధరలు విపరీతంగా పెరగడంతో దేశ వ్యాప్తంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలు ఉండగా, ఇప్పుడు 1000 రూపాయలు దాటిందని, సామాన్య గృహిణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.