Site icon HashtagU Telugu

Harish Rao: అనవసర మందులు, టెస్టులు రాస్తే ఊరుకోమ్ .. వైద్యులకు హరీష్ రావు హెచ్చరిక

Harish Rao

Harish Rao

వైద్యసేవల్లో అనైతికంగా వ్యవహరించే డాక్టర్ల పై కొరడా ఝులిపిస్తామని తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రోగులకు అనవసర మందులు, టెస్టులు రాస్తూ.. అక్కర లేని సర్జరీలు చేస్తున్న వైద్యులను ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పునర్ వ్యవస్థీకృతం చేసిన ‘ తెలంగాణ మెడికల్ కౌన్సిల్’ ఈ వ్యవహారాలను సీరియస్ గా తీసుకుంటుందని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ కోఠి సుల్తాన్ బజార్ లో ఉన్న ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రిలో 8 ఆపరేషన్ థియేటర్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవల్లో తలెత్తే లోపాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దృష్టిసారిస్తుందని తెలిపారు.

అనైతికంగా ప్రవర్తించే వైద్యులు, ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో వెనుకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైద్య సేవల రంగంలో జవాబుదారీ తనానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కో బెడ్ నిర్వహణ కోసం రూ.5000 మాత్రమే కేటాయించగా.. ఇప్పుడు సీఎం కేసీఆర్ దీన్ని రూ.7500 కు పెంచిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈనెలాఖరులోగా తెలంగాణలో కొత్త పారిశుధ్య విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ కోసం రాష్ట్ర సర్కారు ఏటా ఇప్పుడున్న బడ్జెట్ కంటే రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

Exit mobile version