Revanth Reddy Do or Die: రేవంత్ కు చావోరేవో!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని,

  • Written By:
  • Updated On - August 3, 2022 / 12:44 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని, పార్టీ ఫిరాయింపుదారులకు, నియంతలకు తగిన గుణపాఠం చెప్పి చరిత్ర సృష్టించాలని మునుగోడు ప్రాంత ప్రజలు, కార్యకర్తలను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడులో వ్యూహం, ప్రచారం కోసం ఏఐసీసీ కమిటీని వేసింది. ఆగస్టు 5న మునుగోడులో కాంగ్రెస్‌ సమగ్ర ఉప ఎన్నికల సమావేశం నిర్వహించనుంది. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే, టీపీసీసీ అధ్యక్ష పదవికి తన పేరును సమర్థించిన నాయకులలో రాజ్ గోపాల్ ఒకరని రేవంత్ అన్నారు.

రాజ్‌గోపాల్‌ సోదరుడు, ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీలోనే కొనసాగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే ఎవరినైనా కాంగ్రెస్ సహించదు లేదా విడిచిపెట్టదు. పార్టీ రాజ్‌గోపాల్‌కు ఇవ్వగలిగినదంతా ఇచ్చింది కానీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం తల్లిని (కాంగ్రెస్) అవమానించడం తప్ప మరొకటి కాదు అని రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.  అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహరంపై అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ముందుగానే అలర్ట్ అయ్యాయి. మునుగోడు స్థానం టీఆర్ఎస్ ది కాకపోవడంతో కేసీఆర్ కూడా ఆ నియోజకవర్గంపై ఇప్పటి వరకు గురి పెట్టలేదు. ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ మునుగోడు ప్రజలకు వరాలు గుప్పించే అవకాశం ఉంది. వివిధ పథకాల పేరిట ప్రత్యేక నిధులు మళ్లించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి సైతం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన విషయం తెలిసిందే. మునుగోడులో ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రధానం కావడంతో బీజేపీ ఇప్పటికే సైలంట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే చేరుతానని హింట్ ఇవ్వడంతో బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగే అవకాశాలున్నాయి.  మునుగోడులో బీజేపీ జెండా ఎగురవేసి వచ్చే తెలంగాణను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటు సీఎం కేసీఆర్, అటు మోడీ, షా ద్వయాన్ని ఢీకొట్టగలడా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మునుగోడును కైవసం చేసుకొని రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఈ పొలిటికల్ ఫైట్ పైచేయి ఎవరిదో వేచి చూడాల్సిందే మరి.