Site icon HashtagU Telugu

Djokovic Loses: జకోవిచ్ కు ఫెడరల్ కోర్టు షాక్

novak

novak

వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచి అత్య‌ధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాల‌ని అతని ఆశలకు తెరపడింది. త‌న వీసా రద్దును వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్ లో జకోవిచ్ కు చుక్కెదురైంది.

ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు జోకోవిచ్ వీసా ర‌ద్దును ఆమోదిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా నిబంధ‌న‌ల ప్ర‌కారం మ‌రో 3 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జోకోవిచ్ కంగారు గ‌డ్డ‌పై అడుగు పెట్ట‌డానికి అవ‌కాశం లేదు. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వానికి, జోకోవిచ్‌కు మ‌ధ్య 11 రోజులుగా వివాదం నడుస్తోంది.చివరికి ఈ పోరులో అంతిమంగా ఆస్ట్రేలియా ప్ర‌భుత్వమే విజయం సాధించింది.

ఈ నెల 6న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో పాల్గొన‌డానికి వెళ్ళిన జకోవిచ్ ను మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో దిగ‌గానే అక్క‌డి అధికారులు జోకోవిచ్‌ను అడ్డుకున్నారు. టీకా వేసుకోక‌పోవడంతో అనుమతించలేమని స్పష్టం చేశారు. అయితే వైద్యుల ప్రత్యేక అనుమతితో తాను వచ్చానని
జకోవిచ్ చెప్పినా ఎయిర్‌పోర్టు అధికారులు వీసాను ర‌ద్దు చేశారు. దీంతో త‌న‌కు న్యాయం చేయాలంటూ జకోవిచ్ కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌కు క‌రోనా సోకినందు వల్లే వ్యాక్సిన్ వేసుకోలేక పోయాన‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. జకోవిచ్ వివ‌ర‌ణతో సంతృప్తి చెందిన న్యాయ‌స్థానం అత‌ని వీసాను పునురుద్ద‌రింప చేయాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనిని స‌వాల్‌గా స్వీక‌రించిన ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఈ సారి బ‌ల‌మైన ఆధారాల‌తో వీసాను రెండో సారి ర‌ద్దు చేసింది.

జోకోవిచ్ క‌రోనా వ్యాక్సిన్ వేసుకోలేద‌ని, దీంతో ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్యా అత‌ని వీసాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనిపై జకోవిచ్ రెండోసారి కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో తీవ్ర నిరాశ చెందిన జకోవిచ్ సోమ‌వారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో జోకోవిచ్ పాల్గొన‌కుండానే వెనుదిరుగుతున్నాడు. కోర్టు తీర్పు పై పలువురు టెన్నిస్ క్రీడాకారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. కొందరు జకోవిచ్ ను సమర్డిస్తే…మరికొందరు నిబంధనలు అందరికీ ఒకటేనని అభిప్రాయ పడ్డారు.

Cover Photo Courtesy: Novak Djokovic Twitter

Exit mobile version