Site icon HashtagU Telugu

RCB Beats DC: మాక్స్ వెల్, డీకే మెరుపులు… ఆర్ సీబీ విజయం

RCB Fans

RCB Fans

ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 16 పరుగులతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసిందంటే మాక్స్ వెల్ , దినేశ్ కార్తీక్ లే కారణం. ఓపెనర్లు డుప్లెసిస్ , అనూజ్ రావత్ విఫలమవడంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ కూడా రనౌటవడంతో బెంగళూరు ఒత్తిడిలో పడినట్టు కనిపించింది. ఈ దశలో మాక్స్ వెల్ ఆ జట్టును ఆదుకున్నాడు. ఒక వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ గ్లెయిన్ మాక్స్‌వెల్ మాత్రం చెల‌రేగిపోయాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో మాక్స్‌వెల్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కు ఇది 13వ హాఫ్ సెంచ‌రీ. అయితే కుల్దీప్ యాద‌వ్ మాక్సీని పెవిలియన్ కు పంపడంతో ఆర్ సీబీ తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. షాబాద్ అహ్మద్ తో కలిసి ఫోర్లు, సిక్సుల‌తో స్కోరును పెంచేశాడు. ముస్తిఫిజ‌ర్ ర‌హ్మాన్ వేసిన 18వ ఓవ‌ర్లో 4 ఫోర్లు, 2 సిక్సులు బాదిన దినేష్ కార్తీక్ ఏకంగా 28 ప‌రుగులు రాబ‌ట్టాడు. దీంతో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డీకే షాబాజ్ తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 52 బంతుల్లోనే 97 ప‌రుగులు జోడించాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. దినేశా కార్తీక్34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 , షాబాజ్ అహ్మద్ 21 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 32 ప‌రుగులతో నాటౌట్ గా నిలిచారు.ఢిల్లీ బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్, ఖ‌లీల్ అహ్మ‌ద్, కుల్దీప్ యాద‌వ్, అక్ష‌ర్ పటేల్ త‌లో వికెట్ తీశారు.

190 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా తొలి వికెట్ కు 4.4 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. షా 16 రన్స్ కు ఔటైనా… వార్నర్ దూకుడుగా ఆడాడు. చాలా కాలం తర్వాత మునపటి వార్నర్ ను చూసినట్టనిపించింది. వార్నర్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులకు రెండో వికెట్ గా ఔటయ్యాడు. తర్వాత మిఛెల్ మార్ష్ , పావెల్ కూడా నిరాశపరచడంతో ఢిల్లీ పూర్తి డిఫెన్సివ్ లో పడిపోయింది. చివర్లో రిషబ్ పంత్, శార్థూల్ ఠాకూర్ పోరాడినప్పటకీ ఫలితం లేకపోయింది. ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో మూడో ఓటమిని చవిచూడగా…రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయాన్ని అందుకుంది. అలాగే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్ళింది.

Pic Courtesy- RCB/Twitter