Munugodu By-Election: మునుగోడు అభ్యర్థిపై ‘టీఆర్ఎస్’ టెన్షన్ టెన్షన్

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Written By:
  • Updated On - August 11, 2022 / 03:50 PM IST

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్ మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దించే అవకాశం ఉందన్న వార్తలపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని కోరుతూ కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులో నియోజకవర్గంలో జరిగే సమావేశంలో హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అప్పుడే రాజగోపాల్ రెడ్డి చేరే అవకాశాలున్నాయి.

ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని యోచిస్తున్నారు.  2018లో రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డిని మళ్లీ పార్టీ బరిలోకి దింపవచ్చని కొందరు టీఆర్‌ఎస్ నేతలు సూచనప్రాయంగా చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డికి, పలువురు నాయకులు ఈ ప్రతిపాదనను బహిరంగంగా వ్యతిరేకించారు. ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మునుగోడు కీలక నేతలు కేసీఆర్‌కు లేఖ రాయడంతో, పార్టీ అధినాయకత్వం పార్టీ నేతలందరితో చర్చలు జరపాలని మంత్రి జగదీష్ రెడ్డిని కోరింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి కొద్దిమంది నేతలతో సమావేశమై అసంత్రుప్త నేతలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

దాదాపు 30 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ నాయకత్వమే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని, పార్టీ అభ్యర్థి గెలుపునకు నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి వారికి సూచించారు. మాజీ ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌, మాజీ ఎంపీ బి.నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, శాసనమండలి చైర్మన్‌ జి. సుఖేందర్‌రెడ్డి లాంటివాళ్లు టీఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఉన్నారు. అయితే జగదీష్ రెడ్డి కూడా ప్రభాకర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. సుఖేందర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, నర్సయ్యగౌడ్‌ వంటి నేతలు నియోజకవర్గానికే పరిమితం కావడం పార్టీకి ఇష్టం లేదని ప్రభాకర్‌రెడ్డిని బలపరిచే వారు వాదిస్తున్నారు. 2018లో రాజగోపాల్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు ఎన్నికల్లో మాత్రం ఆయన  గెలిచారు.