Site icon HashtagU Telugu

AP Employees: సమ్మె విరమణపై ఉద్యోగుల్లో చీలిక

Ys Jagan Chalo Vijayawada

Ys Jagan Chalo Vijayawada

సమ్మె విరమణ ఉద్యోగుల మధ్య రచ్చ రేపుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయులు ఫైర్ అవుతున్నారు. హెచ్ ఆర్ ఏ ను సచివాలయ ఉద్యోగుల వరకు పెంచుకోవటంపై గ్రామీణ ఉద్యోగులు మండిపడుతున్నారు. వాళ్ళ ఒత్తిడికి ఏపీటీఎఫ్ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ఆ సంఘం కు చెందిన ఉద్యోగులు సమ్మెకు సై అంటున్నారు. పైగా సమ్మె విరమించినట్టు ప్రభుత్వం ప్రకటించిందని, తాము కాదంటూ ఆదివారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆందోళన ఉంటుందని ఏపీటీఎఫ్ వెల్లడించింది. దీంతో ఉద్యోగ సంఘాల మధ్య చీలిక వచ్చింది.
డిమాండ్లు సాధనలో విఫలమయ్యాం, చీకటి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీటీఎఫ్ దూకుడుగా ఉంది. చర్చలు సఫలమైనట్టు ప్రకటించిన ప్రభుత్వంకు వ్యతిరేకంగా కలిసివచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామన్న ఏపీటీఎఫ్ అంటోంది. ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి పెంచుకోలేకపోయామని ఆవేదన చెందుతోంది. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు సఫలమైనట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపినా డిమాండ్లు సాధించుకోవడంలో విఫలమయ్యామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) అధ్యక్షుడు భానుమూర్తి, కార్యదర్శులు పాండురంగ వరప్రసాదరావు అన్నారు. సమ్మె విరమణ చీకటి ఒప్పందం తప్ప మరోటి కాదన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
అంతేకాదు, తమతో కలిసి వచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దుపై చర్చల్లో ఎలాంటి నిర్ణయమూ జరగలేదని, హెచ్ఆర్ఏ శ్లాబులను పునరుద్ధరించలేకపోయామని అన్నారు. ఈ విషయంలో గ్రామీణ ఉద్యోగులకు బోల్డంత నష్టం జరుగుతుందన్నారు.
నిజానికి ఈ చర్చల్లో ఐఆర్ ఇచ్చిన తేదీ నుంచి మానిటర్ బెనిఫిట్ ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చ జరగనే లేదన్నారు. అంతేకాదు, పీఆర్‌సీ నివేదికను చూడలేకపోయామన్నారు. తమ ప్రధాన డిమాండ్ అయిన ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి పెంచుకోలేకపోయామని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని సంఘాలు ఆందోళన బాట పట్టాయి. మొత్తం మీద ఉద్యోగుల సంఘాల్లో సమ్మె విరమణ పై చీలిక కనిపిస్తోంది.