Site icon HashtagU Telugu

IPL 2022: చెన్నైకి షాక్ ఇచ్చిన కోల్ కతా

Dhoni Retirement

Dhoni Retirement

ఐపీఎల్ 15వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో మొదలుపెట్టింది. శనివారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ధోనీ హాఫ్ సెంచరీ (50 నాటౌట్)తో రాణించగా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.

అసలు చెన్నై స్కోరు 100 దాటుతుందా అనిపించిన దశలో జడేజా , ధోనీ ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్ర‌త్తగా ఆడిన వీరిద్ద‌రు క్రీజులో కుదురుకున్నాక చివ‌రి ఓవ‌ర్ల‌లో చెల‌రేగారు. ఈ క్ర‌మంలో ఆరో వికెట్‌కు అజేయంగా 70 ప‌రుగులు జోడించారు. ధోని 38 బంతుల్లోనే 50 ప‌రుగుల‌తో అజేయంగా నిల‌వ‌గా.. జ‌డేజా 26 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ర‌సూల్ వేసిన చివ‌రి ఓవ‌ర్లో 18 ప‌రుగులు వ‌చ్చాయి. కేకేఆర్ బౌల‌ర్ల‌లో ఉమేష్ యాద‌వ్ 2, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఆండ్రూ ర‌సెల్ త‌లో వికెట్ తీశారు.

అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోది దిగగా.. ఓపెనర్ రహానె (44), వెంకటేష్ అయ్యర్ (16) శుభారంభం ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్ అవుటైన తర్వాత నితీష్ రానా (21), బిల్లింగ్స్ (25) తలో చెయ్యి వేశారు. నాలుగు వికెట్లు కోల్పోయినా లక్ష్యం తక్కువగా ఉండటంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (20 నాటౌట్) తన జట్టును 18.3 ఓవర్లలో విజయ తీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో బ్రావోకు 3 వికెట్లు దక్కాయి.