Corona Positive: టీమిండియాలో కరోనా కలకలం

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. జట్టులో ఆరుగురు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌తో సహా మొత్తం 8 మందికి పాజిటివ్‌గా తేలింది.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. జట్టులో ఆరుగురు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌తో సహా మొత్తం 8 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన వారిలో సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో వీరందరినీ ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచినట్టు బీసీసీఐ వెల్లడించింది. ధావన్‌తో పాటు కలిసి వచ్చిన స్పిన్నర్ చాహల్‌ను కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం వారందరికీ స్వల్ప లక్షణాలున్నాయని, బీసీసీఐ మెడికల్ టీమ్ పరిస్థితిని గమనిస్తోందని బోర్డు తెలిపింది. కాగా ఆరుగురు క్రికెటర్ల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే అవకాశమున్నట్టు సమాచారం. అయితే రీ ప్లేస్‌మెంట్‌గా వచ్చే ఆటగాళ్ళు కూడా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉన్న నేపథ్యంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కాగా ఆటగాళ్ళందరూ క్వారంటైన్‌లో ఉండడం, ప్రతీరోజూ టెస్టులు చేస్తున్న నేపథ్యంలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అయితే వైరస్ సోకడానికి బీసీసీఐ అనుసరించిన విధానమే కారణమని తెలుస్తోంది. ఆటగాళ్ళ కోసం గతంలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన బోర్డు ఈ సారి మాత్రం ఎవరికి వారే అహ్మదాబాద్‌కు రావాలని ఆదేశించింది. దీంతో ఆటగాళ్ళందరూ సాధారణ ప్రయాణికులతో పాటే ఫ్లైట్‌లో రావడం, ఎక్కడో ఒక చోట వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. పాజిటివ్‌ ఫలితం రాకముందే వీరంతా జట్టుతో కలవడంతో మిగిలిన వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. అటు విండీస్ క్రికెటర్లు కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తొలి వన్డే జరుగుతుందా లేదా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమని బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6 నుండి మొదలుకానుంది.