అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చి, పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన తాజా చిత్రం ‘పుష్ఫ’. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. క్రికెటర్లు అయితే ‘పుష్ప’ పాటలకు, బన్నీ స్టెప్పులకు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. కాగా, ఇప్పటికే ఎన్నో డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా వేదికగా అలరించిన టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సతీమణి, ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మ మరోసారి తన ప్రతిభ చూపించింది. తాజాగా ఆమె ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మామా ఊఊ అంటావా’, ‘ఏయ్ బిడ్డా’ పాటలకు ఎంతో హుషారుగా తనదైన శైలిలో స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోను ధనశ్రీ వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ…’ గత నెలలో ఈ టూ సాంగ్స్ ఎంతో ఫేమస్ అయ్యాయని’ పేర్కొంది. అలానే తనకు డ్రమా కంటే… డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది.
ఇక యజ్వేంద్ర చాహల్ అర్దాంగి ఇన్ స్టా లో పోస్ట్ చేసిన తక్కువ సమయంలోనే ఎక్కువమంది వీక్షించారు. బీట్, సాహిత్యానికి తగ్గట్టు ధనశ్రీ హావాభావాలు ఉండడంతో… నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. మరి ఫ్యూచర్ లో ధనశ్రీ ఇంకా ఎలాంటి పాటలకు తనదైన శైలిలో స్టెప్పులేసి వీక్షకులను అలరిస్తుందో అన్నది చూడాలి.