DGP: రాష్ట్రంలోని రైల్వే ప్రాంతాల భద్రత పరిస్థితులపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా సమీక్షించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రైల్వేస్ & రోడ్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ ఎం భగవత్ ఆధ్వర్యంలో రైల్వే పోలీస్, రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నాడు నిర్వహించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్ పి ఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ మరియు ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమ సింగ్ ఠాకూర్, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్, హైదరాబాద్ అనూప్ కుమార్ శుక్ల , సీనియర్ డిఎస్సీ సికింద్రాబాద్ దెబష్మిత సి బెనర్జీ , రైల్వే అడిషనల్ డిఆర్ఎం రాజీవ్ కుమార్ గంగెలే, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిఐజి తఫ్సీర్ ఇక్బాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ జి దామోదర్ రెడ్డి , రైల్వే ఎస్పీ సలీమ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో డిజిపి రవిగుప్త మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పోలీస్ కు అవసరమైన మరి కొంతమంది పోలీస్ సిబ్బందిని కేటాయించే విషయమై చర్చిస్తానని అన్నారు. రైల్వే విభాగంలో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జి అర్ పి) 12 రైల్వే పోలీస్ స్టేషన్లోనూ 17 రైల్వే అవుట్ పోస్టులను పని చేస్తున్నారని తెలియజేశారు. రైల్వే పోలీస్ స్టేషన్ల పరిధిలో అవసరమైన కెమెరాలను ఇతర భద్రతాపరమైన సామాగ్రిని పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్ మహానగరం దేశంలోనే అత్యధిక సిసిటీవీ లు కలిగిన రాజధానిగా పేరు ఉందని తదనుగుణంగా రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పండుగ రోజులలోను , సెలవు దినాలలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సందర్భాలలో అదనపు భద్రతపై చర్యలు చేపట్టాలని అన్నారు. రైల్వే ట్రాక్లపై జరుగుతున్న ప్రమాదాలు అన్నింటి పైన రైల్వే పోలీసులు విచారణ జరపాలని సూచించారు.
ఈ సందర్భంగా రైల్వేస్ అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ…. రైల్వే ట్రాక్లపై ప్రమాదాలు అరికట్టేందుకు అయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు , ఫెన్సింగ్ లఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నాంపల్లి, కాజీపేట, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లోని రైల్వే పోలీస్ స్టేషన్ల ను రైల్వే స్టేషన్ల లో ఏర్పాటు చేయడం ద్వారా బాధితులు త్వరితగతిన ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు .లింగంపల్లి ,బేగంపేట్, మేడ్చల్ లలో జి అర్ పి సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిన ఉందని అన్నారు. సికింద్రాబాద్ రూరల్ రైల్వే పోలీస్ సబ్ డివిజన్, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాల పునర్నిర్మాణం కానీ, కొత్త కార్యాలయం ఏర్పాటు కానీ చేయాల్సి ఉందని అన్నారు.