DGCA: DGCA షాక్.. మూత్రవిసర్జన కేసులో ఎయిరిండియాకు రూ.30లక్షల జరిమానా!

విమాన ప్రయాణికులకు ఈ మధ్యన సమస్యలు ఎక్కువ అవుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - January 20, 2023 / 07:31 PM IST

DGCA: విమాన ప్రయాణికులకు ఈ మధ్యన సమస్యలు ఎక్కువ అవుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన ఓ మహిళా ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం చేయడం, ప్రయాణికులు ఎక్కకుండానే విమానాలు బయలుదేరడం లాంటి అనేక సంఘటనలు విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే తాజాగా మహిళ మీద మూత్రవిసర్జన చేసిన కేసులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా స్పందించింది.

మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటనపై స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ ఇండియాకు 30లక్షల జరిమానా విధించింది. అలాగే సదరు విమానాన్ని నడిపిన పైలెట్ల లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. అటు విమాన సిబ్బంది విధులు సరిగ్గా నిర్వర్తించనందుకు గాను సిబ్బందికి రూ.3లక్షల పెనాల్టీని డీజీసీఏ విధించింది.

కాగా నవంబర్ 26వ తేడీన న్యూయార్క్ నుండి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలోని బిజినెస్ క్లాస్ లోని మహిళపై తోటి ప్రయాణికుడు మూత్రం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. శంకర్ మిశ్రా అనే వ్యక్తి తన మీద మూత్రం చేసినట్లు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎయిరిండియా తమ విమానంలో ఇలా చేసినందుకు గాను శంకర్ మిశ్రాను నాలుగు నెలల పాటు తమ విమాన సంస్థకు చెందిన విమానాల్లో తిరగకుండా నిషేధం విధించింది.

ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రా వాదన వేరేలా ఉంది. శంకర్ మిశ్రా దీనిపై స్పందిస్తూ.. ‘ఈ కేసులో నేను నిందితుడిని కాదు. ఆ మహిళే మూత్రవిసర్జన చేసుకొని ఉంటుంది. ఆమె ప్రొస్టేట్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతోంది. అలాంటి వారు ఇలా చేసుకోవడం సహజమే. కానీ నేను మాత్రం ఆమెపై మూత్రవిసర్జన చేయలేదు’ అని అన్నాడు.

ఈ మొత్తం ఘటనపై ఎయిరిండియా స్పందిస్తూ.. ‘మాకు డీజీసీఏ ఉత్తర్వులు అందాయి. వాటిని మేం పరిశీలిస్తాం మా లోపాలను సరిచేసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొందరు ప్రయాణికుల వల్ల కలిగే ఈ తరహా అసౌకర్యాలన డీల్ చేసే విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు ఎయిరిండియా కట్టుబడి ఉంది’ అని ప్రకటన విడుదల చేసింది.