Viveka Murder Case: జ‌గ‌న్ రాజీనామా చేయాల్సిందే.. దేవినేని ఉమ కీల‌క వ్యాఖ్య‌లు..!

  • Written By:
  • Publish Date - February 23, 2022 / 04:51 PM IST

ఏపీ దివంగ‌త మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ప్ర‌స్తుతం సీబీఐ ఈ కేసుకు సంబంధించి విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. ఈ క్ర‌మంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డిని సీబీఐ అధికారులు ఎందుకు విచారించడం లేదని దేవినేని ఉమ ప్రశ్నించారు.

వివేకా హ‌త్య‌ ఘ‌ట‌న జ‌రిగిన రోజున త‌న బాబాయ గుండెపోటుతో చనిపోయారని తొలుత చెప్పింది విజయసాయిరెడ్డే అని దేవినేని ఉమ గుర్తు చేశారు. వివేక‌నంద‌రెడ్డి హత్య కేసులో రోజుకొక కథనాలు వస్తున్నాయని, బాబాయ్ పై గొడ్డలి వేటు చివరకు సీబీఐ అధికారుల‌పై కేసులు పెట్టేంత వరకూ వెళ్లిందని దేవినేని ఎద్దేవా చేశారు. ఛార్జిషీట్ లో పేర్కొన్న తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఇక అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బెదిరింపులు వస్తున్నాయని, ద‌స్త‌గిరిని ఎవ‌రు బెదిరిస్తున్నారో సీబీఐ అధికారులు నిగ్గుతేల్చాలన్నారు. వివేకానంద‌రెడ్డి హత్య కేసులో అసలు నేరస్థులు ఎవరో వెంట‌నే తేల్చాలని, లేకుంటే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.