Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల భూమిని కాజేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ కాజేసిన భూముల వివరాలు బయటకు తీస్తామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చూసి ఓర్వలేక కొందరు కాకుల్లా అరుస్తున్నారు. పసలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. హైడ్రా, మూసీ విషయంలో ఆలోచన చేశాకే ముందుకు పోతున్నాం. మూసీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణ సదుపాయం కల్పిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తమవి అన్ని ఉమ్మడి నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేశారు. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత.. కొత్త సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పీకడం ఎవరి తరం కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు.
ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వంపై కూడా కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ మాట్లాడుతున్న మాటలతో… ఆయన మైండ్ సెట్‌ను మనం అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ఇక జిల్లా కలెక్టర్లపై సైతం ఆయన అదే విధంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.