Dengue : హైద‌రాబాద్‌లో డెంగ్యూ టెన్ష‌న్‌.. వ‌ర్షాకాలం ప్రారంభంతో..?

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 08:09 AM IST

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ ఫీవ‌ర్ టెన్ష‌న్ నెల‌కొంది. డెంగ్యూ జ్వ‌రాలు పెరుగుతున్నాయని.. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ తెలిపారు. దోమల పెర‌గ‌డానికి వాతావరణం మరింత అనుకూలంగా మారినప్పుడు రాబోయే 3-4 వారాలలో వైరస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత నెలలో 15 నుండి 16 డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చాయని.. ఇప్పుడు ఆ సంఖ్య 26 కి పెరిగిందని డాక్టర్ శంకర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు కొంత పెరిగాయని ఆయ‌న తెలిపారు. న‌గ‌రంలో COVID-19 కేసులు కొన్ని మాత్రమే నమోదవుతున్నాయి. ఇప్పటికి ఆరు కేసులు అడ్మిట్ అయ్యాయని, అవన్నీ స్థిరంగా ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

కిమ్స్ ఆసుపత్రికి బేగంపేట, కొంపల్లి, ఉప్పల్, సమీప జిల్లాల నుండి అనేక మంది రోగులు వస్తున్నారని.. అక్కడ కూడా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. సగటున తాము రోజుకు 5-7 అనుమానిత డెంగ్యూ కేసులను చూస్తున్నామ‌ని.. వాటిలో కొన్ని పాజిటివ్ గా నిర్ధార‌ణ అవుతున్నాయ‌ని తెలిపారు. ప్రతి 10 మంది రోగులలో 3-4 మందికి ఆసుపత్రి అవసరమ‌ని.. COVID-19 కంటే ఇప్పుడు డెంగ్యూ పెద్ద ఆందోళనగా ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు. , గత సంవత్సరాల్లో ఓల్డ్ సిటీ నుండి ఆసుపత్రికి అనేక కేసులు వచ్చాయని నీలోఫర్ ఇన్‌స్టిట్యూషన్‌లోని పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి ఉషా రాణి తెలిపారు.

నిర్మాణ కార్యకలాపాలు, నాలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చాలా కేసులు ఉన్నాయని ఆమె అన్నారు. ప్రతి 3-4 సంవత్సరాలకు డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయని… వర్షాకాలం ముందు వచ్చిన కేసుల సంఖ్య ఆధారంగా ఈ సంవత్సరం కూడా అది జరగవచ్చని ఆమె తెలిపారు. 2019లో మహబూబ్‌నగర్ జిల్లాలో వారానికి 70-80 కేసులు నమోదవుతున్నప్పుడు ఇదే విధమైన పెరుగుదల నమోదైందని ఆమె గుర్తు చేశారు.