Dell: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన డెల్.. 6650 ఉద్యోగులకు ఉద్వాసన!

ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వణికిస్తున్న తరుణంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా టెక్ కంపెనీలు చాలా వరకు తమ ఉద్యోగుల్ సంఖ్యలో కోత విధించాయి.

  • Written By:
  • Updated On - February 6, 2023 / 09:14 PM IST

Dell: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వణికిస్తున్న తరుణంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా టెక్ కంపెనీలు చాలా వరకు తమ ఉద్యోగుల్ సంఖ్యలో కోత విధించాయి. వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ బడా టెక్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలు.. వేల కుటుంబాలను రోడ్డు పాలుజేశాయి. అయితే ఈ ఉద్వాసనల పరంపర ఇంకా కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన డెల్ టెక్నాలజీస్ తాజాగా తమ కంపెనీలో పని చేస్తున్న వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. డెల్ టెక్నాలజీస్ తాజాగా 6650 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా టైంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయడం, విద్యార్థులు ఆన్ లైన్ లో క్లాసులు వినడంతో భారీగా పర్సనల్ కంప్యూటర్లు వినియోగించారు. కానీ కరోనా తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది.

కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు నేరుగా క్లాసులు హాజరవుతుండటం, ఉద్యోగులు ఆఫీసులకు వెళుతుండటంతో.. పర్సనల్ కంప్యూటర్ల వినియోగం తగ్గింది. దీంతో డెల్ టెక్నాలజీస్ విషయంలో యధాతథ స్థితి వచ్చింది. ఈనేపథ్యంలోనే కంపెనీకి చెందిన 6650 మంది ఉద్యోగులను తొలగిస్తూ.. డెల్ టెక్నాలజీస్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 5శాతంగా దీనిని పరిగణించవచ్చు.

దీనిపై డెల్ టెక్నాలజీస్ కో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ మాట్లాడుతూ..‘ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని అన్నారు. డెల్ విక్రయాలు 37శాతం తగ్గడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. డెల్ టెక్నాలజీస్ కంటే ముందు హెచ్.పి కంపెనీ గత నవంబర్ లో 6000 మందిని తొలగించింది. అలాగే సిస్కో సిస్టమ్స్ 4000 మందికి ఉద్వాసన పలికింది.