Wrestlers Protest: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో భూషణ్ పై 1000 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఐపీసీ (IPC) సెక్షన్లు 354, 354D, 354A మరియు 506(1) కింద కోర్టు అభియోగాలు మోపింది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. దర్యాప్తులో భాగంగా ప్రతి రోజు నివేదికను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అయితే ఈ కేసులో పోలీసులకు సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం విశేషం. కాగా 210 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓవర్ సైట్ రిపోర్టును కూడా ఛార్జ్ షీట్‌లో చేర్చారు. ఓవరాల్‌గా 161, 164 సెక్షన్ల వాంగ్మూలాలు మినహా విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగానే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.