Electricity Essential Service : ఢిల్లీలో అత్యవసర సర్వీసుగా విద్యుత్.. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటన

Electricity Essential Service : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ప్రకటన చేశారు. విద్యుత్‌ను "అత్యవసర సేవ"గా అనౌన్స్ చేశారు..

Published By: HashtagU Telugu Desk
power

power

Electricity Essential Service : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ప్రకటన చేశారు. 

విద్యుత్‌ను “అత్యవసర సేవ”గా అనౌన్స్ చేశారు..

దేశ రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీలో నిమగ్నమైన సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్ల సమ్మెలపై నిషేధాన్ని ఆయన పొడిగించారు.

విద్యుత్ ఉద్యోగుల సమ్మెలపై ఇప్పటికే అమల్లో ఉన్న నిషేధాన్ని మరో 6 ఆరు నెలల పాటు(జనవరి 3, 2024 వరకు) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పొడిగించారు. BSES రాజధాని పవర్ లిమిటెడ్, BSES యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్, ఢిల్లీ ట్రాన్స్ కో, ఇంద్రప్రస్థ పవర్, ప్రగతి పవర్ కార్పొరేషన్ సంస్థల విద్యుత్ సరఫరా, పంపిణీలో నిమగ్నమైన ఉద్యోగులు, ఇంజనీర్ల కార్యకలాపాలు అత్యవసర సేవల పరిధిలోకి(Electricity Essential Service) వస్తాయని ఆయన వెల్లడించారు. “ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ ఇంజనీర్లు, ఉద్యోగుల ఆందోళనలను నిషేధించడం అవసరం”  అని తెలుపుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఓ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 

వారం క్రితం ఏమైందంటే.. 

వారం క్రితమే దేశ రాజధానిలో విద్యుత్ ఛార్జీలను పెంచుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఢిల్లీ పవర్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది. దీంతో 200 యూనిట్లకు పైబడి విద్యుత్ వాడుకునే వినియోగదారులపై అదనంగా 8 శాతం సర్‌ఛార్జి పడనుంది. 200 యూనిట్లు లోపు విద్యుత్ వాడుకునే వారికి మాత్రం విద్యుత్ టారిఫ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. విద్యుత్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పిటిషన్లు వేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. విద్యుత్ రేట్ల పెరుగుదలకు కేంద్రమే కారణమని ఢిల్లీ  మంత్రి అతిషి ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు చాలా కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణాలోపం, కోల్‌ బ్లాక్‌ల రేట్లు పెంచడం వల్లే ఢిల్లీలో విద్యుత్ టారిఫ్ పెరిగినట్టు ఆమె తెలిపారు.

  Last Updated: 05 Jul 2023, 08:45 AM IST