DC Vs MI: ముంబై ఇండియన్స్ కి ఢిల్లీ పంచ్

ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ఆరంభించే సంప్రదాయాన్ని ముంబై మరోసారి నిలబెట్టుకుంది. దాదాపు విజయం ఖాయమని అనుకున్న దశలో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.

  • Written By:
  • Updated On - March 28, 2022 / 12:19 AM IST

ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ఆరంభించే సంప్రదాయాన్ని ముంబై మరోసారి నిలబెట్టుకుంది. దాదాపు విజయం ఖాయమని అనుకున్న దశలో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్‌ (82) కు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), తిలక్ వర్మ(15 బంతుల్లో 3 ఫోర్లతో 22) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

178 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్లు ఆరంభంలోనే దెబ్బ‌కొట్టారు. ఆ జ‌ట్టు స్పిన్న‌ర్ మురుగన్ అశ్విన్ ఇన్నింగ్స్ నాల్గో ఓవ‌ర్లో రెండు వికెట్ల‌తో చెల‌రేగాడు. దీంతో ఢిల్లీ 72 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ దశలో శార్దూల్ ఠాకూర్‌తో క‌లిసి ల‌లిత్ యాద‌వ్ ఢిల్లీని ఆదుకున్నాడు. వీరిద్ద‌రు ఆరో వికెట్‌కు 32 ప‌రుగులు జోడించారు. అయితే శార్దూల్ ఔటయ్యాక ల‌లిత్ యాద‌వ్‌, అక్ష‌ర్ పటేల్ ఊహించ‌ని విధంగా మ్యాచ్‌ను మ‌లుపుతిప్పారు. అద్భుత భాగ‌స్వామ్యంతో ఢిల్లీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. వీరిద్దరూ భారీ షాట్లతో చెలరేగిన వేళ ఢిల్లీ మ‌రో 10 బంతులు మిగిలి ఉండ‌గానే 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. అక్షర్ పటేల్ 17 బంతుల్లోనే 38 ప‌రుగులు , లలిత్ యాదవ్ 38 బంతుల్లో 48 ప‌రుగులు చేసారు. లలిత్ యాద‌వ్ అజేయంగా నిలిచారు. వీరిద్ద‌రు ఏడో వికెట్‌కు అజేయంగా 30 బంతుల్లోనే అజేయంగా 77 ప‌రుగులు జోడించారు. దీంతో సీజన్ ను ఢిల్లీ ఘనంగా ఆరంభిస్తే…వరుసగా పదోసారి ముంబై ఓటమితో సీజన్ ను మొదలుపెట్టింది.