Delhi Baba: 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా!

ఈ కేసుతో పాటు ఇదే స్వామిపై 2009లో ఒక కేసు నమోదై ఉండగా, 2016లో మరో మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Delhi Baba

Delhi Baba

Delhi Baba: ఢిల్లీలో ఒక ఆశ్రమంలో బాబా (Delhi Baba) అరాచకం కలకలం రేపింది. వసంత్‌కుంజ్‌లోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి (అలియాస్ స్వామి పార్థసారథి)పై 17 మంది విద్యార్థినులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ మొత్తం 32 మంది విద్యార్థినులు పీజీ డిప్లొమా కోర్సులు చదువుతుండగా.. వారిలో 17 మంది ఈ బాబా తమను అసభ్యంగా వేధించారని ఆరోపించారు.

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులే లక్ష్యం

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులు స్కాలర్‌షిప్ ఆధారంగా ఇక్కడ చదువుకుంటున్నారు. స్వామి వారిపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అసభ్యకర మెసేజ్‌లు కూడా పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా బాబా చెప్పినట్టు వినాలని విద్యార్థినులపై ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలోని వార్డెన్లు కూడా బాబాతో పరిచయం చేయడంలో సహకరించారని వారు తెలిపారు.

Also Read: Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

పోలీసుల దర్యాప్తు, బాబా పరారీ

వాయువ్య ఢిల్లీ డీసీపీ అమిత్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాబాపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, మోసం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు.. ఆశ్రమంలో. స్వామి నివసించే ప్రదేశంలో సోదాలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అయితే స్వామి చైతన్యానంద ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. చివరిసారిగా అతని మొబైల్ సిగ్నల్ ఆగ్రా సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గతంలో కూడా కేసులు

ఈ కేసుతో పాటు ఇదే స్వామిపై 2009లో ఒక కేసు నమోదై ఉండగా, 2016లో మరో మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా ఆరోపణల నేపథ్యంలో శ్రీ శృంగేరీ శారదా పీఠం ట్రస్ట్ బోర్డు అతడిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించి, అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంస్థలో ఒక్కో బ్యాచ్‌లో 35 మంది విద్యార్థులు ఉంటారు. ఒడిశాకు చెందిన ఈ స్వామి 12 ఏళ్లుగా ఈ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఈ తాజా కేసుతో అతని అరాచకాలు తీవ్ర స్థాయిలో వెలుగులోకి వచ్చాయి.

  Last Updated: 24 Sep 2025, 03:39 PM IST